పాఠశాలల పరిస్ధితిపై సిపిఎం సర్వేముపాళ్ల,జనవారధి: సిపిఎం ముపాళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు,అవసరమైన మౌలికసదుపాయాలపై శుక్రవారం సర్వే నిర్వహించారు.సర్వేలో భాగంగా లంకెలకూరపాడు, నార్నెపాడు,పలుదేవర్లపాడు గ్రామాలలో ఉన్న పాఠశాలలను సందర్శించారు. అక్కడ ఉన్న సమస్యలను ప్రధానోపాధ్యాయులు ద్వారా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లంకెలకూరపాడు ఎస్సీ కాలనీలో ఉన్న యంపిపియస్ యల్.ఇ ఫ్రైమరి పాఠశాల శిథిలావస్థకు చేరడం, స్లాబు నుండి పెచ్చులూడి పోవటం, ఏ సమయంలో నైనా కూలే ప్రమాదం ఉందని గుర్తించారు.నార్నెపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నైట్ వాచ్ మెన్ లేకపోవడం చేత పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సర్వేలో తెలిసిందని నాయకులు పేర్కొన్నారు.పలుదేవర్లపాడులోని  ప్రభుత్వ ఫ్రైమరి తదితర పాఠశాలలను సందర్శించి పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థుల తలిదండ్రులను  సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఆలమోతు సుందరయ్య, నూకారపు సాంబశివరావు, కూరపాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.