టెక్నాలజీతో ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి...తొలిసారి ఎంపీగా ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా.. మొబైల్ ఫోన్‌లో చూసి ఎంపీగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం కోసం రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన రేవంత్.. ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల మనసు గెలుచుకున్నారు.