తేల్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చా...ఎంపీ సుమలత!రాజకీయాల్లోకి రావాలనే తపనకానీ.. పదవులు అనుభవించాలనే ఆసక్తికానీ ఉండేది కాదని అంబరీశ్‌తో సాయం పొందినవారే ఆయన దూరమైన రెండు నెలలకే బెదరించారని... తేల్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మండ్య ఎంపీ సుమలత అభిప్రాయపడ్డారు. కన్నడ చానెల్‌లో వీకెండ్‌ ప్రోగ్రామ్‌లో ఆమె తన మనోభావాలను వెల్లడించారు. అంబరీశ్‌ స్వర్గస్తులయ్యాక మండ్య జిల్లాలో పలు ప్రాంతాలలో వర్ధంతి సభలు అభిమానులు జరిపారని సదరు కార్యక్రమాలకు కుమారుడు అభిషేక్‌తో కలసి వెళ్ళానన్నారు. మాతో కలసి ఉండేలా రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరారన్నారు.
 
అయితే రాజకీయాలు అంత సులువు కాదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతలోనే జేడీఎస్‌కు చెందిన ముఖ్యులు (మంత్రి రేవణ్ణ) నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. చివరకు బెదరింపులకు దిగారన్నారు. భర్త కోల్పోయిన ఓ మహిళ పట్ల కనీస సానుభూతి చూపలేదన్నారు. ఇలా అనుచితంగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకనే రాజకీయ ప్రవేశం చేశానన్నారు. అంబరీశ్‌తో లబ్ధి పొందినవారే మాకు వ్యతిరేకులయ్యారన్నారు. అంబరీశ్‌ సత్తా ఏంటో చూపుదామనే స్వతంత్రంగా పోటీ చేశానన్నారు. నటులు దర్శన్‌, యశ్‌లు, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ వ్యక్తిగతంగా వారికి నష్టం కలిగించేలాంటి ప్రక్రియలు సాగినా నా వెన్నంటి నాతోపాటు నడిచారన్నారు.