ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం..ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. 11.15నిమిషాలకు అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాకులోని సీఎం జగన్‌ చాంబర్లో గవర్నర్‌ నరసింహన్‌ శంబంగితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, కొత్తగా ఎంపికైన మంత్రులు, సచివాలయ అధికారులు హాజరయ్యారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి శంబంగి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా శాసనసభ సమావేశాల తొలిరోజున ఎమ్మెల్యేల చేత శంబంగి ప్రమాణస్వీకారం చేయిస్తారు. స్పీకర్ ఎన్నిక కొనసాగే వరకు శంబంగి ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారమే ప్రొటెం స్పీకర్‌ చేత ప్రమాణస్వీకారం చేయించాలని సీఎం నిర్ణయించారు.