వైరల్ గా మారిన కుమారస్వామి తనయుడి వ్యాఖ్యలు...కర్నాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతున్న ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చుననీ వాటి కోసం ఇప్పటి నుంచే మనం కసరత్తు మొదలుపెట్టాలి. అలసత్వం పనికి రాదు. వచ్చే నెల నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ఆయన చెబుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. మాండ్యకు చెందిన ఓ జేడీఎస్ కార్యకర్త తొలుత సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ఏడాదిలోపే లేదా మరో రెండు, మూడేళ్ల తర్వాత ఎన్నికలు రావొచ్చు. జేడీఎస్‌ కార్యకర్తలంతా ఇందుకు సన్నద్ధంగా ఉండాలని నిఖిల్‌ కుమారస్వామి తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండురోజుల క్రితం మండ్యలో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కుమారస్వామి తనయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో ఉన్నది నిఖిల్‌ గొంతేనా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.