మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి...సీఎం జగన్!వైసీ‌ఎల్పీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్పారు. 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేసిన జగన్.. అందులో 20మందికి మంత్రి పదవులు కేటాయించగా మిగిలిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులను కేటాయించారు. మరో రెండున్నరేళ్ల తరువాత 90శాతం మంత్రుల్ని మారుస్తామన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పకనే చెప్పేశారు. 
 
కొత్తవారికి అప్పుడు అవకాశం ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం మనవైపే చూస్తోందని పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ అన్నారు. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలన్నారు. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని సూచించారు. ఏపీలో అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలన్నారు సీఎం జగన్.