జనసేన ఓటమిపై నేడు పవన్ సమీక్ష...ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తరవాత తొలిసారి అధినేత పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఈ సమీక్షకు వేదిక కానుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి పటమటలో తన నివాసానికి వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. 
 
కాగా, సమీక్ష సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పవన్ పిలిపునిచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం చేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. ఈయనొక్కడే జనసేన తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓడిపోయిన జనసేనాని.. పార్టీ శ్రేణుల్లో మళ్లీ పాత ఉత్సాహం తీసుకురావడానికి పూనుకున్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించనున్నారు. దీనిలో భాగంగా భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తున్నారు.