రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న జేసీ....!అనంతపురం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా వాడే... నేనెప్పుడూ జగన్‌ను ద్వేషించలేదు... రాజకీయంగానే విమర్శించా’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఎస్పీతో కాసేపు చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నలభై ఐదేళ్లుగా రాజకీయ జీవితం గడిపాను. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. వాటికి ఇక గుడ్‌బై చెప్తున్నా’ అని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ప్రజల సంక్షేమానికీ అదేవిధంగా కృషి చేశానన్నారు. 
 
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం పట్ల ఆయన స్పందిస్తూ.... జగన్‌, మోదీల విజయం సునామీలాంటిదని ఒక్క మాటలో జవాబిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకోవడంతోనే వైసీపీకి అధికారం కట్టబెట్టారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారని, ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్రమోదీతో ఎంతో వినయంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలు, సూచనలిచ్చేంత వ్యక్తిని తాను కాదన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమేనని, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరంలేదన్నారు. బీజేపీలో చేరతారనే ప్రచారంలో నిజం లేదని జేసీ ఖండించారు. తాను శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతున్నానన్న నిర్ణయమే ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ విషయంలో మాట్లాడేందుకు తాను చాలా చిన్నవాడినని వ్యాఖ్యానించారు.