పార్టీకి మీ సేవలు అవసరం లేదు!: బొత్స మేనల్లుడుఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల నుంచే పలువురు తెలుగుదేశం పార్టీ మండలస్థాయి నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకుల ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు కుప్పిగెంతులు వేసే ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకునేది లేదని ఆపార్టీ నాయకులు ముఖం మీదే చెప్పడంతో పాలుపోని పరిస్థితి వీరిలో నెలకొంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఓ వెలుగు వెలుగుతూ దర్జా చెలాయించిన మారేడుబాకకు చెందిన ఓ మాజీ సర్పంచి తన సమీప గ్రామ మాజీ సర్పంచుతో కలిసి అయిదు రోజుల క్రితం చీపురుపల్లిలోని బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్నశ్రీనును కలిసినట్టు వైఎస్సార్‌ సీపీ శిబిరంలో చెప్పుకుంటున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాసేవలు వినియోగిచుకోవాలని, మీతోనే ఉంటామని చెప్పారు. 
 
అయితే వారితో పార్టీకి మీ సేవలు అవసరం లేదని చిన్న శ్రీను చెప్పినట్లు రాజాంలోని పార్టీ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉంటూ కోండ్రు మురళీ విజయం సాధించి మంత్రి అయ్యాక ఓ వెలుగు వెలిగిన ఈయన 2014 ఎన్నికల ముందు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కంబాల జోగులు విజయానికి సహకరించారు. తన స్వగ్రామంలో వైకాపాకు సుమారు 584 ఓట్లు మెజారిటీ వచ్చేలా కృషి చేశారు. కావలి ప్రతిభా భారతికి ఎమ్మెల్సీ పదవి వరించడంతో ఆమె పంచన చేరి కొన్నాళ్లు చక్రం తిప్పారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన ఎం.పి.టి.సి.ని తెలుగు దేశం పార్టీలో చేర్చేందుకు ఈయన చేసిన కృషి అప్పట్లో చర్చనీయాంశమైంది.