అమ‌రావ‌తి విరాళాలు ఏమైన‌ట్టు?... వైఎస్ జ‌గ‌న్ ఆరా!మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వ‌చ్చిన వార్త‌లపై కొత్త ప్ర‌భుత్వం దృష్టి సారించింది. మై బ్రిక్-మై అమ‌రావ‌తి పేరుతో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన నిధులు ఏమ‌య్యాయ‌నే అంశంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరా తీయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన రాజ‌ధాని ప్రాంత అభివృద్ది అథారిటీ (సీఆర్డీఏ) అధికారుల‌తో నిర్వ‌హించ‌బోయే స‌మీక్ష సంద‌ర్భంగా ఆయ‌న ఈ నిధుల గురించి క్షుణ్నంగా చ‌ర్చించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
 
న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌జా రాజ‌ధానిగా మారుస్తానంటూ అధికారాన్ని అందుకున్న తొలి రోజుల్లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను ప్ర‌జ‌ల నుంచే సేక‌రించ‌డానికి త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఆరంభించారు. `మై బ్రిక్‌-మై అమ‌రావ‌తి` పేరుతో ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాజ‌ధాని నిర్మాణానికి త‌మ‌వంతు స‌హ‌కారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చే వారు ఈ వెబ్‌సైట్ ద్వారా ఇటుక‌ల‌ను కొనుగోలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఒక్కో ఇటుక ఖ‌రీదు 10 రూపాయ‌లుగా నిర్ధారించారు.
 
రాజ‌ధాని నిర్మాణానికి ఇటుక‌లు అనే సెంటిమెంట్‌తో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున నిధుల‌ను సేక‌రించింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. ప్ర‌తి సామాన్యుడు కూడా ప్ర‌జా రాజ‌ధాని నిర్మాణంలో భాగ‌స్వామ్యులు కావాల‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో పిలుపు ఇచ్చారు. సామాన్యులను కూడా భాగ‌స్వామ్యం చేయ‌డానికి 10 రూపాయ‌ల నుంచి విరాళంగా చెల్లించ‌వ‌చ్చ‌ని అన్నారు. దీనితో తెలుగుదేశం పార్టీకి సానుభూతిప‌రులుగా ఉన్న కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు ఈ వెబ్‌సైట్ ద్వారా ల‌క్ష‌ల్లో నిధుల‌ను ప్ర‌భుత్వానికి విరాళంగా ఇచ్చారు. మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌లు కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా త‌మ తాహ‌తుకు అనుగుణంగా స్పందించారు.