తెదేపా కౌన్సిలర్ల గైర్హాజరు వెనుక కథేమేటి..?తెదేపా కౌన్సిలర్ల గైర్హాజరు వెనుక కథేమేటి..?
అధికారం మారటంతో చేతులెత్తేసిన టిడిపి?
పార్టీపై అసంతృప్తే కారణమా..?
వ్యూహాత్మకంగా గైర్హాజరైన‌ వైకాపా కౌన్సిలర్లు..?
 
 
సత్తెనపల్లి,జనవారధి: ఐదేళ్ళ క్రితం ముప్పాళ్ళ మండలంలో వైయస్సార్ పార్టీ ఎంపిటిసిలు ఎక్కువ మందిని గెలుచుకుంది. మండలి అధ్యక్ష పదవికి అర్హత ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తక్కువ మంది ఉన్న ఎంపిటిసిలతో అడ్డదారిలో  గద్దెనెక్కారు.ఇప్పుడు సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ కు 2నెలల పదవీ కాలం ఉండగానే తెదేపా చేతులెత్తేసింది.అక్కడ గద్దెనెక్కటానికి,ఇక్కడ చేతులెత్తేయటానికి ఉన్న మధ్య రేఖ ఒకే ఒక్కటి...అధికారం. అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమేనని రాజకీయాలు మరోసారి నిరూపిస్తున్నాయి.తెదేపా కౌన్సిలర్లను సమావేశానికి రాకుండా అధికారంలోకి వచ్చిన వైకాపా ముఖ్య నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.తెదేపా కౌన్సిలర్లు కూడా అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు ఇదొక అవకాశంగా భావించినట్లున్నారు.కౌన్సిల్ కు హాజరైనా మాకు ఒరిగేదేమి లేదనుకున్నారో ఏమో ఇప్పటి వరకు పెత్తనం చేసిన కౌన్సిలర్లందరు కావాలనే డుమ్మా కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోరం లేక కౌన్సిల్ వాయిదా వేసుకోవటం పట్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
 
తెదేపా కౌన్సిలర్ల గైర్హాజరు వెనుక కథేమేటి..?
 
ఐదేళ్ళపాటు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పనంగా అధికారం అనుభవించి,ప్రజా సమస్యలు చర్చించే కౌన్సిల్ సమావేశానికి దూరం కావటం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసిపి నేతలు,టిడిపి కౌన్సిలర్లతో టచ్ లో ఉంది సమావేశానికి రానీయకుండా ప్రయత్నించారేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు కౌన్సిల్ ముందుకు వచ్చే అంశాలకు ఆమోద ముద్ర పడినా పెద్దగా టిడిపి కౌన్సిలర్లకు ఉపయోగం లేకపోవటం,ఆ పార్టీ నేతలపై అసంతృప్తే కారణం కావొచ్చని తెలుస్తోంది.ఈ కౌన్సిల్ కు మరో సమావేశానికి అవకాశముండగానే ఎందుకు చేతులెత్తేశారు..? పట్టణంలోని సమస్యల పట్ల చర్చించేందుకు ఎందుకు ఆసక్తి చూపటం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇదా ప్రజల పట్ల ఉన్న వారికున్న‌ మమకారం అని స్ధానికులు విమర్శిస్తున్నారు.
 
మొత్తంమీద 30 మంది కౌన్సిలర్లకు గానూ 17మంది తెదేపా కౌన్సిలర్లలో ముగ్గురు వైసిపిలో చేరగా ఒకరు తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు.15మందికి గానూ 5మంది తెదేపా కౌన్సిలర్లు హాజరు కావటం గమనార్హం.
 
వైకాపా వ్యూహాత్మక వైఖరి..?
మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న తెదేపా కౌన్సిలర్లు అత్యధిక మంది గైర్హాజరు అయ్యేందుకు వైకాపా నేతలే వ్యూహాత్మకంగా వ్యవహరించారని సమాచారం.ఈ పార్టీకి చెందిన కౌన్సిలర్లందరు మూకుమ్మడిగా సమావేశానికి దూరమయ్యారు. కౌన్సిల్ పై పట్టు సాధించేందుకు కోరం లేకుండా సమావేశాన్ని వాయిదా వేయించేలా ఈ ఎత్తుగడ వేసి  వైకాపా కౌన్సిలర్లు పై చేయి సాధించారు.