175 కోట్లకు చేరుకున్న "మహర్షి" కలెక్షన్....సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల లోపలే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసిన ‘మహర్షి’.. 20 రోజుల లోపలే రూ.175 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరుగు చూస్తుంటే ‘రిషి’కి రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ‘మహర్షి’ ఇప్పటి వరకు రూ.175 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విజయవంతంగా ముందుకు దూసుకుపోతోందని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 
 
కాగా, రూ.175 కోట్ల గ్రాస్ మహేష్ కెరీర్‌లోనే అత్యధికం. గతంలో ‘భరత్ అనే నేను’ సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రికార్డును ‘మహర్షి’ క్రాస్ చేసేసింది. ‘నాన్ బాహుబలి’ రికార్డులను చూస్తే.. ‘రంగస్థలం’ అత్యధికంగా రూ.214 కోట్ల గ్రాస్‌ను వసూలు చేస్తోంది. ‘మహర్షి’ స్పీడు ఇలానే ఉంటే ఆ రికార్డును కూడా చెరిపేయడం ఖాయం. తొలిరోజే మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ‘మహర్షి’ ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టం పట్ల ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా టాక్‌ ముందుగానే ఊహించిన నిర్మాతలు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయం, రైతు అనే కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రచారం ‘మహర్షి’కి బాగా కలిసొచ్చింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.