జాతీయ‌ రాజకీయాల్లో చంద్రబాబుదే కీ రోల్ - రంగారావుగుంటూరు,జనవారధి:దేశంలో దశలవారీగా జరుగుతున్న ఎన్నికల్లో మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తుందని, ఇది ఖచ్చితంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు నాయకత్వం కీలకం కాబోతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి రంగారావు పేర్కొన్నారు. గురువారం నాడు గుంటూరులో ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి మరియు వివిధ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్న మోడీ చేస్తున్న నిరంకుశ పాలన పట్ల దేశంలో ప్రత్యక్షంగా  గళం విప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అటువంటి చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలను ఏకం చేస్తూ దేశ రాజకీయాలను తన వైపుకు తిప్పుకున్న చంద్రబాబు త్వరలో కేంద్రంలో కీలక భూమిక పోషించబోతున్నట్లు ఆయన తెలిపారు. 
 
గతంలో ఎన్డిఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు తన అనుభవంతో దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకువచ్చి మోడీ వెన్నులో వణుకు పుట్టించేలా దేశమంతా తిరిగి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయకత్వాన్ని దేశ ప్రజలు హర్షి స్తున్నట్లు రంగారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు రంగారావు పేర్కొన్నారు. ఎన్నికల నాటి నుండి కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబును అడ్డుకోవాలని చూసిన వైకాపా మరియు తెరాస నేడు మౌనం దాల్చటం చూస్తుంటే  తెలుగుదేశం ప్రభుత్వ విజయానికి ఇదే సంకేతమని ఆయన తెలిపారు. ప్రజాక్షేత్రంలో జరిగిన ఈ పోరులో అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.