మహర్షి మూవీ రివ్యూ....Rating: 3.0/5 
Star Cast: మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాశ్ రాజ్ 
Director: వంశీ పైడిపల్లి
 
 శ్రీమంతుడు, భరత్‌ అనే నేను లాంటి భారీ హిట్ల తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ఊపిరి తర్వాత దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా హై టెక్నికల్‌ వేల్యూస్‌, పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో ఓ మైలురాయిగా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు కోరుకొంటున్నట్టు మహేష్ కెరీర్‌లో అద్భుతమైన చిత్రంగా ఈ సినిమా నిలిచిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
పేద కుటుంబానికి చెందిన రుషి కుమార్ ప్రతిభావంతుడైన విద్యార్థి. తండ్రి (ప్రకాశ్ రాజ్) అంటే ఓ కారణంగా ద్వేషిస్తాడు. సక్సెస్‌ను తప్పా మరొకటి ఆలోచించని రుషి తక్కువ సమయంలోనే కార్పోరేట్ రంగంలో దిగ్గజ కంపెనీకి సీఈవో అవుతాడు. కెరీర్ కోసం ప్రేయసి (పూజా హెగ్డే)ను వదులుకొంటాడు. కానీ తన సక్సెస్‌కు రవి (అల్లరి నరేష్) కారణమని విషయం తెలియడంతో అతడిని వెతుక్కుంటూ గోదావరి జిల్లాలోని రామవరంకు వెళ్తాడు. కార్పోరేట్ సంస్థ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రవికి అండగా నిలబడుతాడు. ఆ క్రమంలో గ్యాస్ నిక్షేపాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వివేక్ మిట్టల్ (జగపతిబాబు)ను ఎదుర్కొనేందుకు సిద్దపడుతాడు. రవి లక్ష్యాన్ని చేరుకోవడానికి, పోరాటాన్ని గెలిపించడానికి రిషి రైతుగా మారుతాడు.
 
రిషి కోసం రవి చేసిన త్యాగం ఏమిటి? పూజా ప్రేమను ఎందుకు కాదనుకొంటాడు? తండ్రిని ఏ కారణంగా ద్వేషిస్తాడు? చివరికి రవి, తన తండ్రి (ప్రకాశ్ రాజ్) కన్న కలలను ఎలా చేరుకొన్నాడు? రైతుల కోసం రిషి తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటి? ప్రజల్లో స్ఫూర్తి నింపే క్రమంలో రుషి మహర్షిలా ఎలా మారడనేది సినిమా కథ. తొలిభాగంలో రుషి సీఈవోగా ఎదగడంతో హై నోట్‌లో సినిమా ప్రారంభం అవుతుంది. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సరదగా సాగిపోతుంటాయి. పూజాతో రొమాంటిక్ సీన్లతో కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో ప్రేక్షకులకు జోష్ నింపేలా ఉంటుంది. ఇక రవి, రుషిల మధ్య వచ్చే ఎపిసోడ్స్ కథకు బలంగా చేకూర్చేలా ఉంటాయి. కాలేజీ సీన్లలో చాలా ఇంటెలెక్చువల్‌గా సాగిపోతాయి. ప్రతీ ఫ్రేమ్‌లో మహేష్ తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీయడంతో సినిమా చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. రవికి జరిగిన అన్యాయం తెలుసుకొని రుషి ఇండియాకు వెళ్లడంతో తొలిభాగం ముగుస్తుంది.
 
రెండో భాగంలో రైతుల సమస్య ప్రధానంగా సాగుతుంది. రైతులు, కార్పోరేట్ సంస్థల భూసేకరణ అంశాలు వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా నిలుస్తాయి. వివేక్ మిట్టల్ వేసే ఎత్తులకు రిషి వేసే పైఎత్తులు సినిమాకు ప్లస్ అవుతాయి. అలాగే చివర్లో రైతుల గురించి, వారు పడుతున్న కష్టాలు గురించి రిషి పాత్రతో చెప్పించిన తీరు ఆలోచింపజేసేలా ఉంటుంది. ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న పరిస్థితులు, ఆత్మహత్యలు, వాటి నివారణకు అనుసరించాల్సిన చర్యల గురించి చెబుతూ సామాజిక సందేశంగా సినిమా క్లైమాక్స్ ముగుస్తుంది. మహర్షి సినిమా అనేక అంశాలకు, భారీ స్కోప్ ఉన్న కథకు చిత్రం. మూడు రకాల షేడ్స్‌తో సామాజిక అంశాలు జొప్పించి ఓ సూపర్‌స్టార్ ద్వారా స్టోరిని చేసే ప్రయత్నం చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాలేజీ ఎపిసోడ్స్ యూత్‌కు నచ్చేలా, తండ్రి, స్నేహితుల మధ్య జరిగే ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా, రైతుల సమస్యల గురించి ప్రస్తావించి సమాజాన్ని ఆలోచింపజేసేలా సినిమా కోసం కథను రాసుకొన్న తీరు అభినందనీయం. కానీ సన్నివేశాలు, కథపై పట్టు కోల్పోయి నిడివిని పెంచేయడం సినిమాకు మైనస్‌గా మారింది. కాకపోతే తాపీగా కథ వినాలనుకొనే ప్రేక్షకులు ఫుల్ మీల్స్‌లా సినిమాను అందించారనే చెప్పవచ్చు. మహేష్ బాబు స్టామినాకు, క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
 
శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్‌ క్యారెక్టర్‌లో రుషిగా ఒదిగిపోయాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సీఈవోగా, రైతుల కోసం, స్నేహితుడి కోసం పోరాటం చేసే యువకుడిగా, ప్రేమికుడిగా, తండ్రి ఆశయాలను కొనసాగించే కొడుకుగా ఇలా రకరకాల ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. మహేష్ బాబు బాగా నటిస్తాడని కొత్తగా చెప్పనక్కర్లేదు. రిషి పాత్రతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఫైట్స్ సన్నివేశాల్లో ఇరుగదీశాడు. పాటల్లో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నాడు లాంటివి మహేస్ స్టేటస్‌కు రొటీ. కానీ రైతుల బ్యాక్ డ్రాప్‌లో మహేష్ చెప్పిన సందేశాలు ప్రతీ ప్రేక్షకుడిని ఆలోచింజేసేలా అనిపిస్తాయి.