చెదిరిన కల .. కరణ్‌ జోహర్‌కు భారీ దెబ్బ!బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, హై ప్రొఫైల్ యాక్టర్లతో రూపొందిన కళంక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు చుక్కలు చూపించారు. ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఫ్లాప్‌తో బేజారెత్తిన బాలీవుడ్‌కు కళంక్ రూపంలో మరో భారీ జట్కా తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కారణంగా దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ లాంటి అగ్ర తారలు నటించిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 
 
 
కళంక్ సినిమాకు బాలీవుడ్‌లో ఓ ప్రత్యేకత ఉంది. కరణ్ జోహర్ తండ్రి యష్ జోహర్ డ్రీమ్ సినిమా ఇది. గతంలో ఈ సినిమాను నిర్మించాలనుకొన్న యష్.. కొన్ని కారణాల వల్ల ఈ కథను తెర మీదకు మలచలేకపోయారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ కథను తాజా పరిస్థితులు, టెక్నాలజీకి అనుగుణంగా కరణ్ జోహర్ తీర్చి దిద్దారు. దాంతో సినిమాపై అన్ని వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కళంక్ చిత్రం శుక్రవారం కాకుండా రెండు రోజుల ముందే అంటే ఏప్రిల్ 17నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు దండిగానే కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఏ రోజు కూడా వసూళ్ల వేగం పుంజుకోలేకపోయింది. గుడ్ ఫ్రైడే, హనుమాన్ జయంతి హాలీడేస్‌లో కూడా ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించలేకపోయింది.
 
దాంతో కళంక్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు వసూళ్లను చూసి రూ.100 కోట్ల క్లబ్‌ను అవలీలగా దాటేస్తుందని అనుకొన్నారు. అయితే ఈ చిత్రం గత ఏడురోజుల్లో రూ.75 కోట్లు కూడా దాటకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది. ఇక ఏ సినిమా సత్తాను పరీక్షించే తొలి సోమవారం రోజున కలెక్షన్లు క్షీణించడంతో కళంక్ కథ కంచికే అనే భావన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కళంక్ కలెక్షన్లు గత కొద్దిరోజులతో పోల్చుకొంటే 70 శాతం క్షీణించాయి. శనివారం రూ.9.75 కోట్లు, ఆదివారం రోజున ఈ చిత్రం 11.63 కోట్లు వసూలు చేశాయి. ఇక లిట్మస్ టెస్ట్‌గా భావించే సోమవారం ఈ చిత్రం కేవలం రూ.3.50 కోట్లను మాత్రమే వసూలు చేయడం గమనార్హం.