ముంబై ఇండియన్స్‌పై ఓటమికి అదే కారణం : ధోనీ



ఈ ఐపీఎల్‌ సీజన్‌లో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ బ్రేకులు వేసింది. గతరాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. జట్టు ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. తొలి అర్ధ భాగంలో బాగానే ఆడామని అయితే, ఆ తర్వాత మిస్ ఫీల్డింగ్, బౌలింగ్ లోపాల వల్ల పరాజయం పాలైనట్టు వెల్లడించాడు. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని తమ ఓటమికి అదే కారణమని అన్నాడు. గాయాలు జట్టును వేధిస్తున్నాయని ధోనీ పేర్కొన్నాడు. బ్రావో గాయంతో బాధపడుతున్నాడని, డేవిడ్ విల్లీ లేని లోటు జట్టులో కనిపిస్తోందన్నాడు. డెత్ ఓవర్లలో అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తర్వాతి మ్యాచ్‌లో కొన్ని మార్పులు తప్పవని, ఆటగాళ్ల కాంబినేషన్ కూడా మారుస్తామని ధోనీ పేర్కొన్నాడు.