అదరగొడుతున్న భారత బౌలర్లు...ఆసీస్ 236/7హైదరాబాద్: తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా‌కు బుమ్రా తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఫించ్‌ను బుమ్రా డకౌట్ చేయడంతో స్కోరు బోర్డుపై పరుగులు చేరకుండానే ఆసీస్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఖవాజా (76 బంతుల్లో 50), స్టోయినిస్ (53 బంతుల్లో 37) ఆసీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. 
 
శతక భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడిని కేదార్ జాదవ్ విడదీశాడు. స్టోయినిస్‌ను ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి చక్కగా అందుకున్నాడు. కాసేపటికే ఖవాజాను కుల్దీప్ ఔట్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఖవాజా భారీ షాట్ ఆడగా.. విజయ్ శంకర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడాడు. హ్యాండ్స్‌కాంబ్ (19)తో కలిసి ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుల్దీప్ స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్ స్టంపౌటయ్యాడు. 
 
కొత్త కుర్రాడు టర్నర్ (23 బంతుల్లో 21), మ్యాక్స్‌వె‌ల్‌ (51 బంతుల్లో 40).. ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. ఈ దశలో షమీ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో 39.5 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్లు నష్టపోయి 173 రన్స్ చేసింది. చివర్లో కౌల్టర్ నైల్ (28), కేరీ ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో చివరి పది ఓవర్లలో ఆసీస్ 63 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో షమీ, కుల్దీప్, బుమ్రాలకు తలో రెండు వికెట్లు దక్కాయి.