ఉగ్ర‌దాడిపై ఘాటుగా స్పందించిన‌ గౌతం గంభీర్జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించారు. ఇక మాటల్లేవని యుద్ధమేనంటూ ట్వీట్ చేశారు. గంభీర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు. జవాన్ల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే గంభీర్ స్పందించారు.
 
ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ట్వీట్ చేస్తూ.. ‘అవును, వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్‌తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు’ అని గంభీర్ పేర్కొన్నారు. గంభీర్ ట్వీట్ చేసే సమయానికి 18 మంది జవాన్లు అమరులైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 44కు చేరినట్లు తెలుస్తోంది.