ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌ కూడా భారత్‌దే..!



ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌‌లోనూ ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్: 114 బంతుల్లో 6x4), కేదార్ జాదవ్ (61 నాటౌట్: 57 బంతుల్లో 7x4) అజేయ అర్ధశతకాలు బాదడంతో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన సగర్వంగా కంగారూల గడ్డపై పర్యటనని ముగించింది. 
 
ఈ సిరీస్‌కి ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అంతకముందు ఆస్ట్రేలియాలో తొలిసారి వన్డే ఆడిన భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. చాహల్ (6/42) దెబ్బకి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 230 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో పీటర్ హ్యాండ్స్‌కబ్ (58: 63 బంతుల్లో 2x4) మాత్రమే అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు.