అరోన్ ఫించ్‌పై బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యంఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌పై ఆఖరి వన్డేలోనూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యం కొనసాగింది. తాజా పర్యటనలో ఆ గడ్డపై ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన భారత్.. అరోన్ ఫించ్‌ని మాత్రం కనీసం ఒక్క అర్ధశతకం కూడా చేయనివ్వలేదు. ఈరోజు మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ అతడ్ని 14 పరుగులకే పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో.. వరుసగా మూడు వన్డేల్లోనూ అరోన్ ఫించ్‌ని ఆరంభంలోనే ఔట్ చేసిన భువీ అతనిపై ‘హ్యాట్రిక్’ ఆధిపత్యం చెలాయించినట్లైంది..! 
 
జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 76 బంతుల్లో 16x4, 10x6 బాదిన అరోన్ ఫించ్ ఏకంగా 172 పరుగులు చేశాడు. దీంతో.. భారత్‌పై సుదీర్ఘ సిరీస్‌లో అతను చెలరేగిపోతాడని అంతా భావించారు. కానీ.. ఆసీస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఎంతలా అంటే..? ఆ మెరుపు శతకం తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 26 ఇన్నింగ్స్‌లు ఆడిన అరోన్ ఫించ్.. కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. భారత్‌పై తాజా సిరీస్‌లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోరు 47కాగా.. ఏకంగా ఎనిమిదిసార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరడం ఫించ్‌పై భారత్ బౌలర్ల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది.